Rajnath Singh: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర సందర్భంగా జైసల్మీన్ లో ఆయన కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
Read Also: Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై ఎఫ్ఐఆర్.. అల్లర్లను పెంచేందుకు యత్నించారని ఆరోపణ
చంద్రయాన్ చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయిందని.. అయితే ‘‘రాహుల్‌యాన్’’ లాంచ్ కాదని, ల్యాండ్ కాదని రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోనియా, రాహుల్, అశోక్ గెహ్లాట్ సనాతన ధర్మంపై వారి వైఖరేంటో స్పష్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. డీఎంకే సనాతన ధర్మాన్ని విమర్శించిందని, కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శించిన ఇండియా కూటమి సభ్యులు క్షమాపణ అడగాలని..లేదంటే దేశం వారిని క్షమించదని ఆయన హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా పరిగణిస్తుందని.. ‘‘వసుధైక కుటుంబం’’ అనే భావనను, సందేశాన్ని ఇస్తుందని రక్షణ మంత్రి అన్నారు. హిందూ-ముస్లిం సమస్యను ముందుకు తెచ్చి కాంగ్రెస్ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని రాజ్ నాథ్ ఆరోపించారు.
అంతకుముందు డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమార్ని రేపాయి. చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, డెంగ్యూ, మలేరియాలతో సనాతన ధర్మాన్ని పోల్చాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఉదయనిధి సంజాయిషీ ఇచ్చుకున్నారు.
