Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు యాత్రలో రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు మూలగం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ యాత్ర 13 కిలోమీటర్ల పాటు సాగింది. దీని తరువాత స్వల్ప విరామం తీసుకుని సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారి జిల్లా మర్తాండంలోని నేసమని క్రిస్టియన్ మోమోరియల్ కాలేజ్ వద్ద రాహుల్ బస చేయనున్నారు. ఇప్పటి వరకు 43 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ.
తమిళనాడులో నేటితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఈ రోజు రాత్రి కేరళలోకి రాహుల్ పాదయాత్ర చేరనుంది. రాత్రి కేరళ త్రివేడ్రం జిల్లా చెరువర కోణంలోకి పాదయాత్ర చేరనుంది. కేరళలోకి చేరే సమయంలో ఘనంగా స్వాగతించాలని కేరళ కాంగ్రెస్ భావిస్తోంది. కేరళ రాష్ట్రంలో 19 రోజులు 457 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. కేరళలో 43కి పైగా అసెంబ్లీ, 12
లోక్ సభ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. కేరళలోని వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు.
Read Also: Heavy Rains Today and Tomorrow: తెలంగాణను వీడని వరుణుడు.. నేడు, రేపు భారీ వర్షాలు
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొత్తం 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల పాటు సాగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన తర్వాత భారత్ జోడో యాత్ కాశ్మీర్లో ముగియనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ ను కలిపే విధంగా భారత్ జోెడో యాత్ర సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే 2024 సాధారణ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీని సన్నద్ధం చేసేలా ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. శుక్రవారం పాదయాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీ షర్టు గురించి బీజేపీ విమర్శలు చేసింది. రాహుల్ ధరించిన టీషర్టు విలువ రూ.40,000 ఉంటుందని బీజేపీ ట్వీట్ చేసింది.