Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘Gen Z’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. భారత్ నేపాల్‌లా కావాలని అనుకుంటున్నారా..?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారని, రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్‌లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

ఇదిలా ఉంటే, ఇవన్నీ అబద్ధాలే అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఓటముల నిరాశ నుంచి రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. అయితే, ఈ విమర్శలు ప్రతి విమర్శల మధ్య రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. ఆయన తన ట్వీట్‌లో దేశ ‘‘యువత, దేశ విద్యార్థులు, దేశంలోని జెన్-జీ రాజ్యాంగాన్ని కాపాడుతారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని, ఓటు చోరీని ఆపుతారని, నేను వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటా’’ అని పోస్ట్ చేశారు.

Read Also: Gautam Adani: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. అదానీకి సెబీ క్లీన్‌చిట్..

అయితే, ఇప్పుడు ఈ ట్వీట్ లో ప్రత్యేకంగా Gen Z అని పేర్కొనడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ కొత్త పదాన్ని ఎందుకు ఉపయోగించారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల, నేపాల్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 51 మంది వరకు మరణించారు. దీంతో, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ప్రస్తుతం, సుశీల కర్కీ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

బంగ్లాదేశ్‌లో కూడా అక్కడి రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్లు, బీఎన్‌పీ, హిఫాజతే ఇస్లామ్, జమాతే ఇస్లామ్ వంటి సంస్థలు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వాన్ని పడగొట్టాయి. అయితే, రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ‘‘జెన్-జీ’’ అని ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా ఈ రెండు దేశాల్లో జరిగినట్లు భారత్‌లో కూడా జరగాలని కోరుకుంటున్నారా..? అని బీజేపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version