Site icon NTV Telugu

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మరోసారి ఈడీ విచారణ

Rahul

Rahul

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి 11.10 గంటలకు ముగిసింది.

ఇటీవల నేషనల్ హెరాల్డ్ లో ఆర్థిక అవకతవకలపై ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ముందుగా జూన్ 2న విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరినప్పటికీ.. ఆయన విదేశాల్లో ఉండటంతో జూన్ 13న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు సోనియాను జూన్ 8న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.. అయితే కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీని జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ కేసులో ఇంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సల్ ను విచారించింది ఈడీ.

ఇదిలా ఉంటే సోమవారం రాహుల్ గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగ కాంగ్రెస్ నేతలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీతో పాటు రాష్ట్రాల రాజధానుల్లో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈడీ సమన్లకు వ్యతిరేఖంగా సత్యాగ్రహ యాత్రలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ చట్టానికి అతీతుడు కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతికి మద్దతు ఇస్తున్నారని బీజేపీ విమర్శించింది.

Exit mobile version