Site icon NTV Telugu

Rahul Gandhi: ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నాపై రాహుల్ స్పందన..

Rahul

Rahul

బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్​ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారపూరిత ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ భరోసానిచ్చారు.

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యాలయానికి శాశ్వత ఉపకులపతి నియామకం జరపకపోవడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, ఏకరూప దుస్తుల పంపిణీ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్‌ తమ విద్యాలయానికి రావాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. వర్షం కురుస్తున్నా… గొడుగులు పట్టుకుని ఆందోళన తెలిపారు. తమవి సిల్లీ డిమాండ్స్‌ అన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రధానమైన 12 సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

Exit mobile version