Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు
  • మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
  • వీడియో సందేశంలో ప్రతిపక్ష నేత డిమాండ్
Rahulgandhi

Rahulgandhi

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది కేవలం ప్రతీకాత్మకమైన రాజీనామా అయినప్పటికీ.. దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి కీలక అడుగుగా అభివర్ణించారు. విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంలో ఒక పెద్ద అడుగు. ఆయన ఒక ప్రతీక మాత్రమే. అందుకే ఇది ప్రతీకాత్మక నిర్ణయమే అయినప్పటికీ చాలా ముఖ్యమైనది.’’ అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల నిరంతర ఆందోళనలే కారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, దేశ భవిష్యత్తు, రాజ్యాంగ పరిరక్షణ కోసం వీధుల్లోకి వచ్చి పోరాడిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. ‘‘వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి విద్యార్థికి నా అభినందనలు. మీపై నాకు గర్వంగా ఉంది.’’ అని అన్నారు.

ఈ రాజీనామా రైతులు, కార్మికులు, పేదలు సహా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి వర్గానికి ఒక సందేశమని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తున్న ప్రతి వర్గం ధైర్యంగా పోరాడితే మార్పు సాధ్యమవుతుందని ఈ పరిణామం నిరూపించింది. దేశ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, సంస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎదుర్కోవాలి.’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా రెండు కీలక డిమాండ్లను నెరవేర్చాల్సి ఉందన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులు, బలప్రయోగానికి పాల్పడిన అధికారులు, వాటిని ఆదేశించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘విద్యార్థులపై చేయి చేసుకున్నవారు, వారిని కొట్టినవారు, కాల్పులకు పాల్పడినవారు, ఈ చర్యలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన ప్రతి ఒక్కరినీ బాధ్యులుగా నిలబెట్టి శిక్షించాలి.’’ అని కోరారు.

మోడీ క్షమాపణ చెప్పాలి

దేశ విద్యార్థుల పట్ల గౌరవం చూపిస్తూ ప్రధాని మోడీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దేశ భవిష్యత్తైన విద్యార్థులపై జరిగిన అమానుష దాడులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై జరిగిన దాడులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.’’ అని పేర్కొన్నారు.