ఎస్‌ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రూ.20 విలువైన ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. అనంతరం అదే బాటిల్‌ను తన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు అందించారు. తీసుకునే ముందు వద్దు.. వద్దు అంటూ తిరస్కరించారు. మొత్తానికి ప్రియాంక ఆ డ్రింక్‌ను తీసుకుని వాసన చూసి.. తాగకుండా పక్కన పెట్టేశారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ సమీపంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఎస్‌ఐఆర్‌పై, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆందోళనలో భాగంగా ఎన్నికల సంఘం కార్యాలయం వైపు కాంగ్రెస్ నేతలు మార్చ్ చేపట్టారు. అయితే వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఆకాశవాణి భవన్ సమీపంలోనే నేతలు బైఠాయించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 34-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో.. గంటల తరబడి ఎండలో ఉండటం నేతలకు ఇబ్బందిగా మారింది. చెట్టు నీడలో కూర్చున్నప్పటికీ వేడి నుంచి పూర్తిగా ఉపశమనం లభించలేదు.
నిరసన కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు చెందిన ప్రముఖ ‘ఖాన్ చాచా’ నుంచి భోజనం వచ్చింది. రోల్స్ తిన్న అనంతరం ఏదైనా డ్రింక్ కావడంతో రాహుల్ గాంధీకి ఎరుపు రంగులో ఉన్న ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ బాటిల్ అందింది. రాహుల్ గాంధీ రూ.20 విలువైన ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. అనంతరం బాటిల్‌ను తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇచ్చారు. ప్రియాంక బాటిల్ తీసుకుని ముందుగా పరిశీలించారు. ఆ తర్వాత డ్రింక్ వాసన చూసి.. చివరకు తాగకుండా వదిలేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక మధ్య జరిగిన ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు ప్రియాంక డ్రింక్‌ను తాగకుండా వదిలేయడంపై సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు ఇద్దరి మధ్య ఉన్న సోదరసోదరీ అనుబంధాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ రూ.20 ‘స్టింగ్’ తాగడాన్ని కొందరు ఆయన సామాన్య ప్రజలతో మమేకం కావాలనే ప్రయత్నానికి ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
పెప్సికోకు చెందిన కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింక్ ‘స్టింగ్’లో కెఫైన్, టారిన్ వంటి పదార్థాలు ఉంటాయి. భారత మార్కెట్‌లో ఇది సుమారు రూ.20కే లభిస్తుండటంతో యువతలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇదే సమయంలో రెడ్ బుల్ వంటి ప్రీమియం ఎనర్జీ డ్రింక్‌లతో పోలిస్తే స్టింగ్ ధర చాలా తక్కువ. దీంతో ఇది మాస్ మార్కెట్‌లో విస్తృతంగా అందుబాటులో ఉండే డ్రింక్‌గా గుర్తింపు పొందింది. అయితే సోషల్ మీడియాలో కొందరు దీనిని వర్గపరమైన స్టీరియోటైప్‌లతో విమర్శిస్తూ ‘చాప్రి డ్రింక్’ అంటూ వ్యాఖ్యానిస్తుంటారు.
రాహుల్ గాంధీ గత కొంతకాలంగా సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండే రాజకీయ నాయకుడిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఆయనను సంపన్న కుటుంబ నేపథ్యం ఉన్న, సామాన్య ప్రజలకు దూరమైన నాయకుడిగా విమర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎండలో నిరసనలో పాల్గొని, రూ.20 విలువైన స్టింగ్ ఎనర్జీ డ్రింక్ తాగిన రాహుల్ గాంధీ దృశ్యం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు దీన్ని ఆయన గ్రాస్‌రూట్ ఇమేజ్‌కు సరిపోయే సన్నివేశంగా పేర్కొనగా.. మరికొందరు రాజకీయ వ్యంగ్యానికి ఉపయోగించుకున్నారు.

