Rahul Gandhi: ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఈ రెండు స్థానాల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఈ రెండింటిలో రాహుల్ గాంధీ ఏ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు..? ఏ స్థానాన్ని వదులుకుంటారు..? అనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆయన వయనాడు సీటును వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Dior Dress: రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఏడాది బతికేయొచ్చుగా..
జూన్ 17లోపు ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. అయితే, అభ్యర్థి ఒక స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఫలితాలు వచ్చిన 14 రోజుల లోపు ఏదో ఒక సీటుకు రాజీనామా చేయాలి. ఏ స్థానానికి రాజీనామా చేయకపోయినా, రెండు స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది.
శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ లేదా వాయనాడ్‌లలో ఏ సీటు ఉంచుకోవాలనే దానిపై చర్చ జరిగింది. నేతలు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేరళకు చెందిన కొడిక్కున్నిల్ సురేశ్ వంటి ఎంపీలు రాహుల్ గాంధీ వయనాడ్ సీటును కొనసాగించాలని వాదించగా, రాయ్‌బరేలీ కోసం ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీ అనేది గాంధీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయక స్థానం అని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపాలంటే రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని నిలబెట్టుకోవడమే కీలకమని నేతలు వాధించారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ 3,90,030 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాయనాడ్‌లో సీపీఐకి చెందిన అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు.