Kiren Rijiju: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పూణేలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్‌ని నిందించడం కారణంగా ఎవరూ నాయకులు కాలేరని హితవు పలికారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నకిలీ కథనాలను ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎదుర్కొంటుందని, నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెలీలపై దాడి
బీజేపీ ప్రజలను ఎప్పుడూ కులాలు, వర్గాల వారీగా విభజించదని రిజిజు చెప్పారు. ఇటీవల నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంపై రిజిజు విమర్శలు గుప్పించారు. ఖాళీ పేజీలు ఉన్న రాజ్యాంగాన్ని పంపిణీ చేశారని, దీంతో రాహుల్ గాంధీ అసలు స్వరూపం తెలిసిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దళితుల్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని, కానీ అసెంబ్లీ ఈ బూటకపు కథనం పనిచేయదని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ అనేక సార్లు అవమానించిందని చెప్పారు.
“ప్రతిపక్ష నాయకుడిగా (లోక్‌సభలో) రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నందున నేను అతనిని గౌరవిస్తాను, అయితే, రాజకీయ కోణం నుండి, అతను అపరిపక్వతను ప్రదర్శిస్తాడు. కాంగ్రెస్ అతడిని చాలా సార్లు లాంచ్ చేసింది. కానీ ఇప్పటి వరకు అతడికి పరిపక్వత లేదు. విదేశాల్లో భారత్‌ని నిందించి నాయకుడిగా ఎదగలేడు’’అని కేంద్రమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎదిగే అవకాశం లేదని ఎద్దేవా చేశాడు. అందుకే ప్రియాంకా గాంధీని ఎన్నికల్లో పోటీ చేసేలా చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి గాంధీ కుటుంబం ముందుంటుందని, బీజేపీకి దేశం ముందుంటుందని ఆయన అన్నారు.