Putin dinner: విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలను కలవకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదని పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు వచ్చిన ఒక రోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం ఈ రోజు(డిసెంబర్ 5) రాత్రి రాష్ట్రపతి నివాసంలో విందు నిర్వహించబోతున్నారు. అయితే, ఈ డిన్నర్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించలేదని తెలుస్తోంది.
Read Also: Pakistan: పాకిస్తాన్ “న్యూక్లియర్ బటన్” ఇప్పుడు అసిమ్ మునీర్ చేతికి..
రాహుల్, ఖర్గేలను ఆహ్వానించకుండా, అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం గ్రాండ్ స్టేట్ డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార, సంస్కృతితో సహా 7 రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రదర్శించేలా ఉమ్మడి సైనిక బృందం ఈ రోజు సాయంత్రం అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని తెలుస్తోంది. భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి సంగీతకారులు దేశభక్తి గీతాలను ప్రదర్శిస్తారని భావిస్తున్నారు.
పుతిన్ స్టేట్ డిన్నర్ కోసం మోనూలో కాశ్మీరీ వాజ్వాన్, రష్యన్ బోర్ష్ట్ వంటి వంటకాలతో పాటు భారతీయ, రష్యన్ వంటకాల మిశ్రమం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విందు చాలా గ్రాండ్‌గా జరుగబోతోంది. సీనియర్ ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులతో సహా 150 మందికి పైగా అతిథులు హాజరుకానున్నారు.