బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎలక్షన్ కమిషన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీ-ఎన్నికల కమిషన్ ఓట్ల కుట్రకు పాల్పడుతున్నారని గురువారం ఇండియా కూటమి సమావేశంలో ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై బెంగళూరులో ధర్నా చేపట్టారు. మరోసారి ఈసీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi-EC: రాహుల్‌గాంధీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ.. డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్
ఓట్ల అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్ సైట్ మూసివేసిందన్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదయ్యాయని.. కర్ణాటకలో కూడా ఫేక్ ఓట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు. ఇదంతా ఓటర్లను మోసం చేయడానికి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజా స్వాధీనానికి కేబినెట్ పచ్చజెండా
బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఓటు దొంగతనం జరుగుతుందని హెచ్చరించారు. ‘‘రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకోగలమని మీరు అనుకుంటే… మీరు మరోసారి ఆలోచించాలి. మేము మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటాము. దీనికి సమయం పడుతుంది. కానీ మేము మిమ్మల్ని పట్టుకుంటాము’’ అని ఈసీకి వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే రాహుల్‌గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ చేసిన ఆరోపణలు అసంబద్ధ విశ్లేషణగా పేర్కొంది. తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు ఫిర్యాదు సమర్పించాలని.. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసింది. రాహుల్‌గాంధీ విశ్వసిస్తే.. డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇవ్వాలని కోరింది. ఒక వేళ డిక్లరేషన్‌పై సంతకం చేయకపోతే విశ్లేషణ, తీర్మానాలు అసంబద్ధమైనవిగా పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించడానికి గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ ఇండియా కూటమికి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటర్ల మోసం గురించి ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విభాగంలో భారీ ఓటర్ల మోసం బయటపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇక రాహుల్ ఆరోపణలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను సమర్పించాలని కోరింది. రాహుల్ వాటిని సమర్పించడంలో విఫలమైతే.. అవాస్తవాలని స్పష్టమవుతుందని చెప్పింది.
