Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

  • నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
  • ర్యాలీ వాయిదా వేయండి
  • రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
Rahulgandhi

Rahulgandhi

‘ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి’ అంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న మెగా ర్యాలీ చేపట్టింది. అయితే ఈ ర్యాలీపై వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్న నేపథ్యంలో ర్యాలీని వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంస్థ అయిన ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లేఖ రాసింది. ర్యాలీని దీపావళి వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగల సమయంలో వ్యాపారం దెబ్బతింటుందని పేర్కొ్న్నారు.

రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఇలా పేర్కొన్నారు. ‘నవంబర్ 1వ తేదీన రామ్‌లీలా మైదాన్‌లో మీ పార్టీ ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ప్రస్తుతం దీపావళి వ్యాపారం జోరుగా సాగుతున్నందున ఈ ర్యాలీని నవంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేయాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము.’’ అని కోరారు.

ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, మెట్రో స్టేషన్ల మూసివేతలు, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటివి మార్కెట్లకు పూర్తి అంతరాయం కలిగిస్తాయని పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో రోడ్ల మూసివేత, జనసమూహాల వల్ల ఢిల్లీ బయట నుంచి రాకపోకలు సాగించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగవచ్చని, భయం కారణంగా కొనుగోలుదారులు ఢిల్లీకి రావడం మానుకోవచ్చని.. ఇది ధంతేరస్, దీపావళి వ్యాపారంపై నేరుగా ప్రభావం చూపుతుందని గోయల్ తెలిపారు.