NTV Telugu Site icon

Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి..

Rahul Gandhi

Rahul Gandhi

ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు.

మహారాష్ట్రలో లోక్‌సభ – అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారు. 39 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అని వెల్లడించారు. మాకు లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదు. కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయి. ఆ ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయయని ఆరోపించారు. మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. చాలా చోట్ల దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్లను తొలగించారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదు. తాను ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.