Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచి వేస్తున్న సోషల్ పాయిజన్కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP- RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Rape Case: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.. విద్యుత్ షాక్ ఇచ్చి హత్య.. సహకరించిన తల్లి..!
ఇక, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కులం ఆధారంగా వివక్షకు గురైతే, సాధారణ దళితుల పరిస్థితి ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాయ్‌బరేలిలో హరియోమ్ వాల్మీకి హత్య, భారత ప్రధాన న్యాయమూర్తిపై షూ దాడిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ ద్వేషాన్ని, మనువాద మనస్తత్వాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. దళితులు, ఆదివాసీలు, ఇతర వెనకబడిన తరగతులు, ముస్లింలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇది ఒక్క పురాన్ కుమార్ పోరాటం మాత్రమే కాదు, ఇది రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై నమ్మకం ఉన్న ప్రతీ భారతీయుడి పోరాటం అని చెప్పుకొచ్చారు. కాగా, హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్, సర్వీసులో కుల వివక్ష, వేధింపులకు గురైనట్లు సమాచారం. ఆయన మరణం కుల ఆధారిత పక్షపాతం, పరిపాలనా వేధింపులు కారణమని తెలుస్తోంది.