NTV Telugu Site icon

Anurag Thakur: రాహుల్ గారు ‘సున్నా’ని చెక్ చేయండి.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పరువుతీసిన బీజేపీ..

Loksabha

Loksabha

Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.

రూ. 12 లక్షల ఆదాయం వరకు ‘‘సున్నా పన్ను’’ అని రాసిన పోస్టర్‌ని బీజేపీ ఎంపీలు ప్రదర్శించారు. కాంగ్రెస్ ఈ ‘‘సున్నా’’ గురించి బాధపడొచ్చు, కానీ ప్రభుత్వం కోట్లాది మంది సామాన్యుల్లో ఆనందాన్ని చూస్తోందని ఠాకూర్ అన్నారు. ‘‘రాహుల్ గారు సున్నాని చెక్ చేయండి’’ అని ఆయన ఎగతాళి చేశారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైన తర్వాత, రాహుల్ గాంధీ పెట్రోల్ పంప్‌లో ‘‘సున్నా’’ని చెక్ చేస్తున్న మీమ్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

Read Also: Allu Aravind : తండేల్ పైరసీ.. అరెస్ట్‌ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రకటించారు, ఇది సంవత్సరానికి రూ. 12.75 లక్షల వరకు సంపాదించే జీతగాళ్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ, అనురాగ్ ఠాకూర్ ఆ పార్టీ పరాజయాల లిస్ట్‌ని వెల్లడించారు. ఠాకూర్ ప్రశ్నించిన ప్రతీసారి, బీజేపీ ఎంపీలు సున్నా అంటూ ప్రతిస్పందించారు. ఇలాంటి రికార్డుని కేవలం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీనే సృష్టిస్తుందని ఆయన సెటైర్లు వేశారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 48 స్థానాలను బీజేపీ, 22 స్థానాలను ఆప్ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం సున్నా స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 67 చోట్ల డిపాజిట్ కోల్పోయింది.