Site icon NTV Telugu

Raghuram Rajan: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Raghuram Rajan Joins Rahul Gandhi During Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో ఐక్యత పెంపొందించే లక్ష్యంతో, పార్టీకి పూర్వవైభవాన్ని తేవాలని ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. రాహుల్ గాంధీ గత మూడు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రెటీలు, బాలీవుడ్ నటులు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం రాజస్థాన్ లో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. బుధవారం ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అయిన తర్వాత రఘురాం రాజన్, రాహుల్ గాంధీతో కలిసి చర్చిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియోను కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు

ఇప్పటికే ప్రముఖ ఉద్యమకారిణి మేధా పాట్కర్, కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన నామ్ దేవ్ దాస్ త్యాగి, నటి స్వరా భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ వంటి వారు రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. మొత్తం 3570 కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో సాగుతోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్ భారత్ జోడో యాత్ర ముగియనుంది.

Exit mobile version