BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!

Raghav Chadha

Raghav Chadha

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత రాఘవ్ చడ్డా పేరు పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన ప్రస్తుతం బిజీపీ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఆయన పేరును ‘షిఫ్టెడ్’గా పేర్కొన్నట్లు రాఘవ్ చడ్డా తాజాగా వెల్లడించారు. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ ఇలా ఎలా చేశారంటూ ఆయన ప్రశ్నించారు.

‘ఇది క్లరికల్ మిస్టేక్ కాదు’

తన పేరు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడంపై రాఘవ్ చడ్డా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం అధికారుల స్థాయిలో జరిగిన పొరపాటు కాదని, రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. తాను పంజాబ్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడినని, తన ఓటర్ ఐడీ మొహాలీలోనే ఉందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నది డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మాత్రమేనని, తుది జాబితా కాదని చడ్డా తెలిపారు. క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని, SIR మార్గదర్శకాల ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాలను ఇప్పటికే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. తుది ఓటర్ జాబితా అక్టోబర్‌లో విడుదల కానుందని అధికారులు తెలిపారు. ఓటర్ లిస్ట్ తయారీ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (DEO) వరకు వివిధ స్థాయిల్లో అధికారులు పనిచేస్తారని చడ్డా తెలిపారు. ఇంతటి వ్యవస్థ ఉన్నప్పుడు తన పేరును ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

ప్రజాప్రతినిధుల విషయంలో ఎన్నికల మార్గదర్శకాల్లో ప్రత్యేక జాగ్రత్తలు ఉండాలని, తన విషయంలో ఆ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అధికార పార్టీకి చెందిన వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతల్లో తనపై ఆగ్రహం పెరిగిందని రాఘవ్ చడ్డా చెప్పుకొచ్చారు. తనతో పాటు పార్టీని వీడిన ఇతర నేతలను కూడా పంజాబ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విమర్శించారు. తన పేరు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం కూడా రాజకీయ కక్షలో భాగమని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను AAP ఖండించింది. SIR ప్రక్రియ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, ఓటర్ జాబితాలో ఎవరిపేరు ఉండాలి, ఎవరిపేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. రాఘవ్ చడ్డా పేరు తొలగింపు వ్యవహారం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. డ్రాఫ్ట్ జాబితాలో చోటుచేసుకున్న ఈ మార్పు తుది జాబితాలోనూ కొనసాగుతుందా? లేక క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో ఆయన పేరు తిరిగి చేరుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.