UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం

  • రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం
  • రోగిని కాలుతో తన్నిన సిబ్బంది
  • ప్రభుత్వం సీరియస్.. సస్పెండ్
Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. రోగి అన్న కనీస స్పృహ లేకుండా సిబ్బంది కాలుతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు ధ్వజమెత్తారు. ఇదేం మానవత్వం అంటూ మండిపడుతున్నారు.

రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పింకీ… నేలపై కూర్చున్న మానసిక వికలాంగుడైన యువకుడిని దారుణంగా తన్ని, దూషించింది. 39 సెకన్లలో 10 సార్లు తన్ని.. దూషించింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మండిపడ్డారు. ఇదేం మానవత్వం అంటూ నిలదీశారు. సీఎంవో ఆదేశాల మేరకు వెంటనే మహిళా కార్మికురాలిని సస్పెండ్ చేశారు.

ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చర్య తీసుకున్నారు. ఎక్స్‌లో ఇలా రాశారు. ‘‘రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో మానసిక వికలాంగుడైన రోగి పట్ల ఒక స్వీపర్ దురుసుగా ప్రవర్తిస్తున్న వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించి, నా ఆదేశాల మేరకు, రాయ్‌బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆ స్వీపర్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటన ఏ పరిస్థితులలోనూ క్షమించరానిది. ఏ రోగి పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం సహించబోము..’’ అని అన్నారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పుష్పేంద్ర కుమార్ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెను తక్షణమే సస్పెండ్ చేశామని, ఈ విషయంపై విచారణ జరుగుతోందని సీఎంఎస్ తెలిపారు.