Site icon NTV Telugu

Rabies: “రేబిస్” సోకిన ఆవు పాలతో ప్రసాదం.. ఊరంతా భయం భయం..

Rabies

Rabies

Rabies: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోని ఒక గ్రామంలో ‘‘రేబిస్’’ కలకలం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల, రేబిస్ సోకిన ఒక ఆవు పాలతో ‘పంచామృతం’ ప్రసాదాన్ని చేశారు. ఆవు పచ్చిపాలతో దీనిని తయారు చేయడంతో ఇప్పుడు దీనిని సేవించిన గ్రామస్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. దాదాపుగా 200 మంది గ్రామస్తులు ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు. దీంతో వారందరూ వెంటనే యాంటీ-రేబిస్ టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు.

Read Also: AP Liquor Scam Case: మద్యం కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు గ్రీన్‌ సిగ్నల్..!

ఉరువా బ్లాక్ పరిధిలోని రాందిహ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం రేబిస్‌తో ఒక ఆవు చనిపోయింది. ఇది తెలియకుండానే ఆ వ్యాధి సోకిన ఆవు నుంచి వచ్చిన పాలను ఉపయోగించి ‘పంచామృతం’ తయారు చేసి, తిన్నారు. ఆవును మూడు నెలల క్రితం ఒక వీధి కుక్క కరిచింది. ఆవు రేబిస్ వ్యాధితో మరణించినట్లు పశు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు 170 మందికి పైగా గ్రామస్తులు రేబిస్ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఆవు యజమాని సుశీల్ గౌర్ మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఆవును ఒక కుక్క కరిచింది. ఆ సమయంలో దానికి టీకాలు వేయించినట్లు చెప్పారు. అయితే, టీకాలు వేయించినప్పటికీ దానికి నిరంతర చికిత్స అవసరం అని తమకు తెలియదని, ఆవు చనిపోవడానికి ముందు రేబిస్ నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ సంఘటనపై, వైద్యారోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. పంచామృతం తిన్న వారందరికి మూడు డోస్‌ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న మూడు రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వబడుతుందని, చివరి డోస్ ఏడవ రోజున ఇవ్వబడుతుందని చెప్పారు.

Exit mobile version