Site icon NTV Telugu

Putin India Visit: డ్రోన్లు, స్నైపర్లు, కమాండోలు.. పుతిన్‌కు 5 అంచెల భద్రత..

Putin India Visit

Putin India Visit

Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నునంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శిస్తున్న పుతిన్ రేపు సాయంత్రం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో కలిసి పుతిన్ డిన్నర్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు లాంఛనప్రాయ స్వాగతం పలుకుతారు. శుక్రవారం, ఆయన రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. దీని తర్వాత, హైదరాబాద్ హౌజ్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి, ఆ తర్వాత భారత మండపంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందులో కూడా ఆయన పాల్గొంటారు.

Read Also: Shocking Incident: అత్తగారింటికి వచ్చిన 20 నిమిషాలకే విడాకులు.. కంగుతిన్న పెళ్లికొడుకు..

పుతిన్ భద్రత కోసం రష్యా నుంచి 40 మందికి పైగా భద్రతా అధికారులు, సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్‌జీ భద్రతా అధికారులు పుతిన్ ప్రయాణించే మార్గాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక మంది స్నైపర్లు పుతిన్ కదలిక మార్గాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేస్తారు. ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ వంటి కెమెరాలను పతిన్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. పుతిన్ ల్యాండ్ అయిన మరుక్షణం నుంచి ఆయనకు 5 లేయర్డ్ సెక్యూరిటీ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతుంది. ఎన్ఎస్‌జీ, ఢిల్లీ పోలీస్ అధికారులు బయట అంచెల భద్రతా విభాగంగా ఉంటారు. రష్యన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ లోపలి వలయంలో ఉంటారు. రష్యా అధ్యక్షుడు, మోడీని కలిసినప్పుడు ప్రధానికి భద్రత కల్పించే భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతా వలయాన్ని పర్యవేక్షిస్తారు.

రష్యా అధినేత బస చేసే హోటల్‌ని ఇప్పటికే భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పుతిన్ పర్యటించాల్సిన ప్రదేశాల్లో కూడా రష్యన్ భద్రతా అధికారులు తనిఖీలను నిర్వహించారు. పుతిన్ ప్రత్యేకంగా ఆరస్ సెనాట్‌లో ప్రయాణించనున్నారు. దీనిని మాస్కో నుంచి విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. ఇటీవల, చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశంలో పుతిన్, మోడీలు ఇద్దరూ కలిసి ఇదే కారులో ప్రయాణించారు.

Exit mobile version