Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!

  • భారత భాషా వైవిధ్యం, నాగరికతపై పుతిన్ ప్రశంసలు..
  • ప్రాంతానికో భాష ఉండటం నిజంగా అద్భుతమని వ్యాఖ్యలు..
  • మోడీతో మాట్లాడినప్పుడు భారత్ గురించి తెలుకున్నట్లు పుతిన్ వెల్లడి..
Putin

Putin

Putin Praises India: భారత ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. దేశంలో ప్రాంతానికో భాష, ప్రత్యేకమైన మాండలికం, సాంస్కృతి గుర్తింపు ఉండటం నిజంగా అద్భుతమని కొనియారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో భాషల వైవిధ్యం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.

సెర్బియన్ చిత్ర దర్శకుడు ఎమిర్ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జనాభా సుమారు 150 కోట్లు ఉంటుందని, అందులో దాదాపు 6 కోట్ల మంది ఒక ప్రధాన భాష మాట్లాడుతుండగా, మిగిలినవారు వివిధ ప్రాంతీయ భాషల్ని ఉపయోగిస్తున్నారని, మోడీతో జరిగిన సంభాషణలో తాను తెలుసుకున్నట్లు ఆయన వివరించారు. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో ఇన్ని భాషాలు, భాషా వైవిధ్యం ఉండటం నిజంగా ఆశ్చర్యకరమని పుతిన్ అన్నారు.

భారత భాషా వైవిధ్యంతో పాటు దాని ప్రాచీన నాగరికతను కూడా పుతిన్ ప్రశంసించారు. భారత సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకమైందని, ప్రధానితో మాట్లాడటం వల్ల భారత్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని వెల్లడించారు. ఇదే సమయంలో రష్యా నాగరికతను కూడా పుతిన్ వివరించారు. రష్యాలో వివిధ జాతులు, వర్గాలు తమ మతాలు, సంప్రదాయాలు, భాషలు, ఆధ్యాత్మిక గుర్తింపును పరిరక్షించుకునే అవకాశం ఉందని చెప్పారు. రష్యన్ నాగరికత ఎవరినీ ఎన్నడూ అణచివేయలేదని పుతిన్ పేర్కొన్నారు. విభిన్న వర్గాల ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపులతో జీవించేందుకు అవకాశం కల్పించడమే రష్యా నాగరికతలోని ముఖ్యమైన లక్షణమని ఆయన వివరించారు.