Site icon NTV Telugu

School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

Punjab School

Punjab School

School Principal Offer: విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. చదువులో విద్యార్థులు మరింతగా రాణించేందుకు మన దేశంలో ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టాపర్‌లకు ఉచిత విమాన, రైలు, రోడ్డు ప్రయాణాన్ని ప్రకటించారు. దానిని నిజం చేసి కూడా నిరూపించారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర బోర్డు పరీక్షల్లో మెరిట్‌ మార్కులు తెచ్చుకోవడంతో.. సంతోషించిన ప్రిన్సిపాల్ వారి విమాన ప్రయాణ కోరికను నెరవేర్చడానికి కూడా వెనకాడలేదు. తన 12 సంవత్సరాల ఆకాంక్షను విద్యార్థులు నెరవేర్చారని వారి కోరికను కాదనలేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఫిరోజ్‌పూర్‌లోని జిరాలో ఉన్న షాహీద్ గురుదాస్ రామ్ మెమోరియల్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ (బాలికలు) ప్రిన్సిపాల్ రాకేష్ శర్మ, విద్యార్థుల విమాన ప్రయాణ ఖర్చులను సొంతంగా తన జేబులో నుంచి భరిస్తున్నారు.

పాఠశాలలోని 10, 12 తరగతుల విద్యార్థులు గత 12 సంవత్సరాలుగా పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పరీక్షల మెరిట్ జాబితాలో చేరడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివేలా ప్రేరేపించేందుకు విద్యార్థులకు ఉన్న కోరికలను ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు. వారు పరీక్షల్లో మెరిట్ సాధిస్తే కోరికలను నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు విమానంలో ప్రయాణించాలని తమ కోరికను ప్రిన్సిపాల్‌కు చెప్పారు. పరీక్షల్లో వారు మెరిట్ సాధించగా.. వారి కోరికను ప్రిన్సిపాల్ నెరవేర్చారు. పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని.. భగవంతుని దయతో నలుగురు విద్యార్థులు, ఇద్దరు 10వ తరగతి, ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్షలలో మెరిట్ స్థానాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు రాకేష్ శర్మ.

Delhi Police: ఢిల్లీ యువతి కేసు.. పోలీసుల కీలక నిర్ణయం

ఇద్దరు పన్నెండవ తరగతి విద్యార్థులు భజన్‌ప్రీత్ కౌర్, సిమ్రంజీత్ కౌర్.. గత ఏడాది నవంబర్‌లో విమానంలో అమృత్‌సర్ నుంచి గోవాకు విమానంలో వెళ్లారని.. వారిద్దరూ గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్‌పో (INEX-2022)కి హాజరయ్యారని ప్రిన్సిపాల్ చెప్పారు. భజన్‌ప్రీత్ తండ్రి స్థానిక గురుద్వారాలో పూజారి కాగా.. సిమ్రంజీత్ తండ్రి ట్రక్ మెకానిక్. మరో ఇద్దరు విద్యార్థులు జనవరి చివరి వారంలో విమానంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళతారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్, ఎర్రకోట తదితర ప్రాంతాలను వారు సందర్శిస్తారని ఆయన చెప్పారు. ఇద్దరు విద్యార్థులు విమాన ప్రయాణ సౌకర్యాన్ని పొందడాన్ని చూసిన తర్వాత.. ప్రస్తుతం మళ్లీ 10, 12 తరగతులకు చెందిన మరో 22 మంది విద్యార్థులు ఇప్పుడు మెరిట్ స్థానాలను పొందడం కోసం ముందుకొచ్చారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 2019లో పాఠశాలలో చేరినప్పుడు జిల్లాలోని 56 పాఠశాలల్లో 48వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు, పాఠశాల ఫిరోజ్‌పూర్ జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ప్రిన్సిపాల్ నొక్కి చెప్పారు.

Exit mobile version