Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం
  • బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్
Punjab

Punjab

పంజాబ్ రాజకీయాల్లో సోమవారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బంధువు అయిన జ్ఞాన్ సింగ్ మాన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ సమక్షంలో పార్టీలో చేరారు.

జ్ఞాన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నేను భగవంత్ మాన్ మేనమామ కొడుకును. ఆయన నాకు కజిన్ కూడా. నేను 2014 నుంచి ఆయనతోనే ఉన్నాను. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి నిరంకుశత్వం, అవినీతి కారణంగా నేను ఆ పార్టీని వీడాను. ఇప్పుడు నేను పంజాబ్‌లో బీజేపీ కోసం పనిచేయాలనుకుంటున్నాను. ఇదే నా పార్టీ..’’ అని అన్నారు.

భగవంత్ మాన్ ఇంటి పక్కనే జ్ఞాన్ సింగ్ మాన్ నివసిస్తున్నారని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ పేర్కొన్నారు. బజిందర్ సింగ్ ఒక ధాబా నడుపుతున్నారని, పంజాబ్ ప్రభుత్వం అతని ధాబాపై జీఎస్టీ దాడులు నిర్వహించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురించి మాట్లాడుతుందని, కానీ పంజాబ్ ప్రభుత్వమే ఒక రెస్టారెంట్‌పై జీఎస్టీ దాడులు నిర్వహించిందని సునీల్ జాఖర్ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. లుధియానా, అమృత్‌సర్‌లలో ఆప్ నాయకులు గూండాయిజానికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఈడీ, సీబీఐ దాడులు ఆగవని, ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేస్తామని తెలిపారు.