NTV Telugu Site icon

Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..

Pune Rape Case

Pune Rape Case

Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్‌స్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.

ఇదిలా ఉంటే, అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పోలీసులు 08 టీములు ఏర్పాటు చేశారు. పూణేకి చెందిన వ్యక్తి తన స్వస్థలానికి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కున్నట్లు పోలీసులు అనుమతిస్తున్నారు. చెరకు తోటలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను మోరించారు. చెరకు తోట దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది కాబట్టి, నిందితుడిని వెతికేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు.

నిందితుడు కూరగాయలు తీసుకెళ్లిన ట్రక్కులో దాక్కుని నగరం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్వస్థలానికి చేరుకుని తన బట్టలు, బూట్లను మార్చుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన 8 టీమ్‌లతో సహా మొత్తం 13 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో, తెలిసిన వ్యక్తులతో మాట్లాడారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 1 లక్ష బహుమతి ప్రకటించారు.

ఈ రోజు తెల్లవారుజామున హోం శాఖ సహాయమంత్రి యోగేష్ కదమ్ మాట్లాడుతూ.. నిందితుడు గాడే ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని కనుగొన్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. నిందితుడిని వదిలిపెట్టబోమని అన్నారు. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ చేసిన ‘‘మరణ శిక్ష’’ వ్యాఖ్యలకు షిండే మద్దతు తెలిపారు.

Read Also: Joe Root: ఓటమి అంటే ఆ మాత్రం బాధ ఉంటది! స్టేడియంలోనే ఏడ్చేసిన జో రూట్

ఏం జరిగింది..?

మంగళవారం ఉదయం 5.45 నుంచి 6 గంటల ప్రాంతంలో పూణేలో అతిపెద్ద బస్టాండ్‌గా ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. సతారా జిల్లాలోని స్వస్థలానికి వెళ్లేందుకు బస్సుకోసం ఎదురుచూస్తున్న సమయంలో, నిందితుడు బస్సు వెళ్తుందని చెప్పి, ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. సీసీ కెమెరాలో నిందితుడు, మహిళతో మాట్లాడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముందుగా బస్సులో లైట్లు లేకపోవడంతో సందేహించిన మహిళకు.. ప్రయాణికులు పడుకున్నారని, అందుకే లైట్లు ఆపేశానని మాయ మాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి, డోర్లు మూసేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 36 ఏళ్ల నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.