Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటనపై ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతూనే ఉంది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన గురించి యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత యువతికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వైద్యులు, సాధారణ ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. నిన్న వైద్యులతో సీఎం మమతా బెనర్జీ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ, వైద్యులు డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఈ సమావేశం జరగలేదు.
ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై ప్రతిష్టంభన ముగించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రండ్ నాలుగు పేజీల లేఖను ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాకు కూడా పంపారు.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ ‘రాజీనామాకు సిద్ధమే’ అని ప్రకటించడం వెనుక కారణాలు?
లేఖలో.. వైద్యులు ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు తాము ఎదుర్కొన్న సమస్యలను ఎత్తి చూపారు. వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి “మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల కొరత” ఉందని పేర్కొన్నారు. ‘‘ అత్యంత నీచమైన నేరానికి గురైన మా సహోద్యోగికి న్యాయం జరిగేలా, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని హెల్త్ వర్కర్స్ అయిన మేమే, భయాందోళన లేకుండా ప్రజలకు మా విధులను నిర్వర్తించగలగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో మీ జోక్యం మనందరికి వెలుగునిస్తుందని, మన చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడేలా మార్గాన్ని చూపుతుందని వారు లేఖలో పేర్కొన్నారు.
‘‘ భయంకరమైన నేరాన్ని, దానిని కప్పిపుచ్చడానికి ఆరోపించిన ప్రయత్నాలను, తదనంతర భయాందోళన వాతావరణ దేశాన్ని మెల్కొ్ల్పాయి. నిష్పాక్షిక దర్యాప్తు మరియు సత్వర, న్యాయమైన మరియు హేతుబద్ధమైన విచారణను కోరుతున్నాయి’’ అని లేఖలో వైద్యులు రాశారు. న్యాయం కోసం తమ డిమాండ్‌లను వ్యక్తం చేస్తూ ‘‘రీక్లెయిమ్ ది నైట్’’ వంటి ఉద్యమానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు, బాధిత వైద్యురాలికి సంఘీభావం తెలిపారని జూనియర్ డాక్టర్లు లేఖలో హైలెట్ చేశారు.