Kerala High Court: బాల్య వివాహాల నిషేధ చట్టం -2006, ఈ దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది. బాల్యవివాహాలపై పాలక్కాడ్‌లో 2012లో నమోదైన కేసును కొట్టేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వీవీ కున్నికృష్ణన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్ తదితర మతాలకు అతీతంగా ఈ చట్టం వర్తిస్తుందని అన్నారు.
ముస్లిం అయిన బాలికకు యుక్తవయసు అంటే 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉందని ఆమె తండ్రితో సహా పిటిషనర్లు కోర్టు ముందు వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ‘‘ఒక వ్యక్తి మొదట భారతీయ పౌరుడిగా ఉండాలి. ఆపై అతని మతం తర్వాత వస్తుంది. మతానికి ముందు పౌరసత్వం మొదలు. కాబట్టి, మతంతో సంబంధం లేకుండా వ్యక్తి హిందువు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ అయినా ఈ బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 అందరికి వర్తిస్తుంది’’ అని కోర్టు జూలై 15 ఆర్డర్‌లో పేర్కొంది.
Read Also: Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
బాల్య వివాహాలు బాలికల చదువు, ఆరోగ్యం వంటి ప్రాథమిక మానవహక్కుల్ని కాలరాస్తాయని, శిశుమరణాలు, ప్రసూతి మరణాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని కోర్టు చెప్పింది. బాల్యంలో పెళ్లైతే బాలికలు గృహ హింస, దుర్వినియోగానికి గురవుతారు, సమాజాల ఆర్థిక అవకాశాలను పరిమితం చేస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు మానసిక గాయాలకు దారి తీయవచ్చు, సామాజిక ఒంటరితనానికి, కుటుంబాన్ని సమాజం నుంచి వేరు చేస్తుందని, అంతర్జాతీయ మానవహక్కుల్ని ఉల్లంఘిస్తాయని కోర్టు తన 37 పేజీల ఆర్డర్‌లో పేర్కొంది.
దశాబ్దాల క్రితం బాల్య వివాహాల నిషేధ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కేరళలో బాల్య వివాహాలపై ఆరోపణలు రావడం బాధాకరమని కోర్టు పేర్కొంది. బాల్యవివాహాల నిషేధ చట్టం వచ్చినప్పటికీ, మహ్మదీయ చట్టం ప్రకారం యుక్తవయసుకు వచ్చిన తర్వాత ముస్లిం యువతికి వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉందంటూ ఇక్కడికి పిటిషనర్లు సమర్థించడం బాధాకరమని కోర్టు చెప్పింది. పిల్లలను వారి ఇష్టానుసారం చదువుకోవడానికి, ప్రయాణం చేయడానికి , వారి జీవితాన్ని ఆనందించడానికి అనుమతించాలని, వారు పరిపక్వత వచ్చిన తర్వాత, వారి వివాహం గురించి నిర్ణయించుకోనివ్వాలని హైకోర్టు సమాజాన్ని కోరింది. బాల్య వివాహాల వల్ల వచ్చే నష్టాలను ఎత్తిచూపడం మీడియా బాధ్యతగా కోర్టు ఆర్డర్ చెప్పింది.