కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.
ఇదే అంశంపై పార్లమెంట్ వెలుపల ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోరీ’ సభలో ప్రధాని మోడీని ఎవరూ దూషించలేదని తెలిపారు. వేదికపై నుంచి నాయకులెవరూ ఏం అనలేదని.. కానీ హాజరైన కార్యకర్తల్లో నుంచి ఒక కార్యకర్త ఆ వ్యాఖ్య చేశారని తమకు తెలిసిందన్నారు. కానీ అది ఎవరు అన్నారో మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. అయినా నాయకులు అనని మాటను తీసుకొచ్చి సభలో బీజేపీ రాద్ధాంతం చేయడమేంటి? అని ప్రశ్నించారు. సభ సజావుగా నడవడం ఏ మాత్రం అధికార పార్టీకి ఇష్టం లేదని.. కాలుష్యంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తే… పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు మాత్రం.. అనవసరమైన టాఫిక్ తీసుకొచ్చి రగడ సృష్టించారని ఆరోపించారు. కార్యకర్త ఎవరో.. ఏదో అన్నదాన్ని సభలోకి తీసుకురావడమేంటి? అని ప్రశ్నించారు.
ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోరీ’ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ‘‘మోడీకి సమాధి తవ్వాలంటూ’’ కార్యకర్తల్లో ఒకరు నినాదాలు చేశారు. ఇదే అంశంపై సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని మోడీని చంపాలనుకుంటున్నారా? అని కమలనాథులు ప్రశ్నించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.
డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభమైన దగ్గర నుంచి ఓట్ చోరీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. గత వర్షాకాల సమావేశాలు కూడా ఇలానే ముగిశాయి. ఈ సమావేశాలు కూడా అలానే ముగిసేలా ఉన్నాయి.
