Site icon NTV Telugu

Tax Refund: ఏపీ, తెలంగాణ నుంచి అత్యధిక ట్యాక్స్ రిఫండ్‌.. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటున్న ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మిథాలి

Tax Refund

Tax Refund

Tax Refund: పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్‌లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్‌ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు. వీరిలో ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో పనిచేసే వారు, ప్రతిష్టాత్మక ఐటీ సంస్థల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్‌లోని ఐటీ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథాలి మాట్లాడారు. 2021-212 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం ఉన్న రిఫండ్‌ మొత్తం 2022-23లో ఒక్కసారిగా 84 శాతానికి పెరిగిందని చెప్పారు. కొంత మంది అర్హత లేని ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యో్గులు, సాఫ్ట్ వేర్‌ ఉద్యోగుల్ని సంప్రదించి అత్యధిక రిఫండ్‌ ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తప్పుడు రిటర్న్ లతో ఎక్కువగా రిఫండ్‌ ఇప్పించి అందులో కమిషన్‌ తీసుకుంటున్నట్టు తెలిసిందని వివరించారు. ఈ విషయమై తెలంగాణ, ఏపీలో నిర్వహించిన దాడుల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇలా తప్పుడు రిటర్న్‌లతో ఎక్కువగా రిఫండ్‌ పొందిన ఉద్యోగులు పనిచేసే సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఉండగా.. వారి పాన్‌ మాత్రం ఏపీ, తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.

Read also: IND vs WI: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!

గత మూడేళ్లలో తప్పుడు సమాచారంతో రిఫండ్‌ తీసుకున్న ఉద్యోగులు సవరించిన రిటర్న్‌లు దాఖలు చేసేందుకు ఒక అవకాశం ఇస్తున్నామని, సరైన రిటర్న్‌లు దాఖలు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని వారు తమ తదుపరి పరిశీలనలో పట్టుబడితే మాత్రం చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని మిథాలి హెచ్చరించారు. ఐటీ అధికారుల పరిశీలనలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తప్పుడు విధానాల్లో రిటర్న్‌లు ఫైల్‌ చేసినట్లు తేలిందని చెప్పారు. కొందరైతే 75 నుంచి 90 శాతం రిఫండ్‌ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది అత్యధికంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్‌ల్లో చేపట్టిన తనిఖీల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని మిథాలి వివరించారు. అవకతవకలకు పాల్పడిన వారు రిఫండ్‌ సొమ్ముపై 12 శాతం వడ్డీతో పాటు 200 శాతం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తప్పుడు క్లైయిమ్స్‌తో రిఫండ్‌ పొందిన వారు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 139(8ఏ) ప్రకారం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సరైన రిటర్న్‌లు దాఖలు చేయాలని సూచించారు. సెక్షన్‌ 140బీ ప్రకారం పన్ను తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రిటర్న్‌లు సమర్పించిన వారు 139(5) సెక్షన్‌ ప్రకారం సవరించిన రిటర్న్‌లు దాఖలు చేయాలని సూచించారు.

Exit mobile version