Presidential Election 2022 Ends – Result To Be Out On July 21: సోమవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్‌లో మొదలైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. పార్లమెంటులో ఓటు వేసేందుకు 736 మంది ఓటర్లకు (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) అనుమతి ఉండగా.. 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేశారు. ఓవరాల్ ఎంపీల సంఖ్య 776 కాగా.. కొందరు సొంత రాష్ట్రాల నుంచి ఓట్లు వేశారు.
పార్లమెంట్‌లో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం పార్లమెంట్ భవన్‌లో ఓటేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వీల్‌ఛైర్‌లో వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు సహా తెలంగాణ, ఏపీ ఎంపీలు కూడా ఓటు వేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విషయానికొస్తే.. 95 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఏపీలో ఇద్దరు, తెలంగాణ ఇద్దరు ఓటు వేయలేదు. ఏపీలో నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాలకు వెళ్లడంతో ఓటింగ్‌కు హాజరు కాలేదు. తెలంగాణలో చెన్నమనేని రమేష్ విదేశాలకు వెళ్లడంతో, మంత్రి గంగుల కమకలార్‌కు కరోనా రావడంతో ఓటు వేయలేదు.
జూలై 21వ తేదీన పార్లమెంట్ హాల్‌లో ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. గెలిచిన అభ్యర్థి జూలై 25వ తేదీన తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలిసింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముదే విజయం ఖాయంగా కనిపిస్తోంది.