President Droupadi Murmu To Attend Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలు దేశాధినేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె మరణం పట్ల యూకేలో విషాద వాతావరణం నెలకొంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు వచ్చే సోమవారం జరగనున్నాయి. రాణి అంత్యక్రియల సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆహ్వానం పంపింది బ్రిటన్. మూడు దేశాలకు తప్ప అన్ని దేశాలకు ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 17-19 తేదీల్లో జరిగే క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత్ తరుపున సంతాపాన్ని తెలియజేసేందుకు ద్రౌపది ముర్ము లండన్ వెళ్లనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 యూనైటెడ్ కింగ్‌డమ్( యూకే) దేశాధినేతగా ఉండటంతో పాటు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అధినేతగా ఉన్నారు. సెప్టెంబర్ 8,2022న ఆమె మరణించారు.
Read Also: Air India Express Plane: ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం.. మస్కట్‌లో ఘటన
క్వీన్ ఎలిజబెత్ మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్ తన సంతాపాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 12న విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ బ్రిటిష్ హైకమిషన్ సందర్శించారు. భారతదేశం రాణి మరణంతో ఈ సెప్టెంబర్ 11న ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని పాటించింది.
లండన్ నగరంలో జరిగే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపుగా 500 మంది విదేశీ ప్రముఖులు హజరయ్యే అవకాశం ఉంది. బ్రిటన్ తో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న అన్ని దేశాలను యూకే ఆహ్వానించింది. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ తో పాటు ఆయన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బిడెన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ప్రధానులు హాజరు కానున్నారు. అయితే ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాను, దాని మిత్ర దేశం బెలారస్ లతో పాటు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మయన్మార్ దేశాలను ఈ కార్యక్రమాలకు యూకే ఆహ్వానించలేదు.
