Site icon NTV Telugu

Rahul Gandhi and PK Meet: రాహుల్‌తో పీకే భేటీ..? గుజరాత్‌ ఎన్నికల కోసం రంగంలోకి..!

కాంగ్రెస్‌ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రంగంలోకి దిగుతున్నారా..? రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌గా సాగుతోంది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో… కాంగ్రెస్‌ పార్టీకి దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లోనూ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత జీ-23 నేతలు గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read Also: UP: నేడు సీఎంగా యోగి ప్రమాణస్వీకారం.. తరలివస్తున్న ప్రముఖులు..

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున పని చేసేందుకు గతేడాది పీకేతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. విశాల ప్రయోజనాల దృష్ట్యా… ఇరువురి మధ్య సఖ్యత కుదిరినట్లు సమాచారం. పాత విభేదాలను పక్కన పెట్టి… మళ్లీ ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో… కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ పని చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి అనుబంధం లేకుండా… కేవలం ఓ ప్రొఫెషనల్‌గా పని చేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఓకే చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో… ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని గుజరాత్ కాంగ్రెస్ నేతలు సమావేశంలో వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే విడిచి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు మాత్రం… దీన్ని కొట్టిపారేస్తున్నారు.

Exit mobile version