NTV Telugu Site icon

Prashant Kishor : కొత్త పార్టీతో పీకే సక్సెస్‌ అవుతారా..?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పీకే. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్వీట్‌ చేశారు. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని.. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేశానని చెప్పారు పీకే. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. జన్‌ సురాజ్‌ పేరిట ఆయన రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఉండి విజయం సాధించిన పీకే.. పార్టీ పెట్టి విజయం సాధిస్తారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పటికే వైసీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్‌ కిషోర్‌.

Read Also: Revanth Reddy: కాంగ్రెస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లాంటిది.. ఎవడి ప్రాక్టీస్‌ వాడిదే…!

రాజకీయ వ్యూహకర్తగా ఉండి రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న పీకే.. గతంలో జేడీయూలో జాయిన్‌ అయ్యారు. కానీ, అందులో చాలా రోజులు మనుగడ సాగించలేకపోయారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో పార్టీ వైఖరితో విభేదించి బహిరంగ ప్రకటన చేయడంతో… పీకేని బహిష్కరించింది జేడీయూ. దీంతో ఆయన రాజకీయ నాయకుడిగా విఫలమయ్యారన్న చర్చ సాగింది. కాగా, మొన్నటి దాకా కాంగ్రెస్‌లో పీకే చేరుతారని సాగిన ప్రచారానికి.. ఆయన ప్రకటనతోనే తెరపడింది. కాంగ్రెస్‌లో చెప్పింది చేయాల్సి వస్తుందనే.. ఆయన ఆ పార్టీలో చేరలేదని గుసగుసలు వినిపించాయి. అలాగే ఒకవేళ కాంగ్రెస్‌లో పీకే చేరినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడితే.. తాను ఎక్కడ టార్గెట్‌ అవుతానన్న భయంతోనే ఆయన వెనకడుగు వేశారని కూడా చర్చ సాగింది. గతంలోనూ రాజకీయ నాయకుడిగా ఫెయిల్యూర్‌ అయిన చరిత్రను కొందరు గుర్తు చేశారు కూడా!. అయితే, తాను విఫలమైన దగ్గరనుంచే ప్రయాణం మొదలు పెడతానంటున్నారు పీకే. ఇప్పటికే రాజకీయాల్లోకి వెళ్లి బయటకు వచ్చిన పీకే.. కొత్త పార్టీ పెట్టి సక్సెస్‌ అవుతారా? లేక విఫలమవుతారా? అన్నది చూడాలి.