Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో భూమిని కేటాయించింది. తన తండ్రి స్మారకం కోసం భూమిని కేటాయించినందుకు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎల్‌అండ్‌డిఓ) భూమి కేటాయించిన లేఖను ఆమె షేర్ చేశారు.
కేటాయించిన స్థలం రాజ్‌ఘాట్ రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో భాగంగా ఉంటుంది. ‘‘ మేము స్మారకం కోసం అడగలేదు. పీఎం చేసిన ఈ పని చాలా విలువైనంది. రాష్ట్ర గౌరవాలను అడగకూడదు, వాటిని అందించాలని బాబా చెప్పేవారు. బాబా స్మృతిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు’’ అని శర్మిష్ట చెప్పింది.
Read Also: Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ప్రణబ్ ముఖర్జీ 2012 నుండి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన 2009 నుండి 2012 వరకు ఆర్థిక మంత్రితో సహా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2019లో దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ని అందించారు. 2020 ఆగస్టులో ప్రణబ్ ముఖర్జీ మరణించారు.
శర్మిష్ట ముఖర్జీ పలు సందర్భాల్లో తన తండ్రిని కాంగ్రెస్ గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ, సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి కాకముందు 45 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా పనిచేశారని.. 30 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీతో అనుబంధం ఉందని ఆమె అన్నారు. సోనియా గాంధీ వ్యక్తిగత సంతాప లేఖని పంపగా, సీడబ్ల్యూసీ కనీసం సంతాప తీర్మానం చేయలేదని ఆమె అన్నారు. రాష్ట్రపతిగా పనిచేసిన కేఆర్ నారాయణన్‌కు సంతాప సభ నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.