Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిణామాల దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్యమంత్రి సోమవారం అత్యున్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. మరోసారి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సూచించారు.
Read Also: Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
రాహుల్ గాంధీకి లేఖ రాశారు మాన్సుఖ్ మాండవీయ. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోవిడ్ నిబంధనల గురించి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. మాస్క్, శానిటైజర్ వాడాకాన్ని అమలు చేయాలని మాండవీయ అన్నారు. టీకాలు వేసుకున్న వారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారు. ఒక వేళ కోవిడ్ నిబంధనలను పాటించకపోతే యాత్రను నిలిపి వేయాలని లేఖలో సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానా రాష్ట్రంలోకి చేరుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. వచ్చే ఏడాది జనవరి 26న కాశ్మీర్ లో ఈ యాత్ర పూర్తికానుంది.
