NTV Telugu Site icon

Air India bomb blast: ఖలిస్తానీవాదుల దుశ్చర్చ.. 1985 ఎయిరిండియా బాంబు పేలుడు నిందితుడిని కీర్తిస్తూ పోస్టర్లు..

Khalistan

Khalistan

Air India bomb blast: ఖలిస్తానీ అనుకూల వర్గాలు రోజురోజుకు ఇండియా అంటే వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా దేశంలో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్కడి ప్రభుత్వానికి భారత్ ఎన్నిసార్లు చెప్పినా కూడా చర్చలు తీసుకోవడం లేదు. ఇటీవల ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కులు హతమార్చిన విధానాన్ని ప్రతిబింభించేలా ఓ పరెడ్ లో శకటాన్ని ప్రదర్శించారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

తాజాగా మరోసారి ఇలాంటి చర్యలకు అక్కడి ఖలిస్తానీవాదులు పాల్పడ్డారు. కెనడాలో 1985 ఎయిర్ ఇండియా బాంబు పేలుళ్ల నిందితుడిని కీర్తిస్తూ ఒక ర్యాలీలో పోస్టర్లు ప్రదర్శించారు. ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన తల్విందర్ పర్మాన్ ను గౌరవిస్తూ, కీర్తిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. పోస్టర్‌లో వేర్పాటువాద నాయకుడిని ‘షహీద్ భాయ్ తల్విందర్ పర్మార్’ అని సంబోధించారు. జూన్ 25 ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కారు ర్యాలీ ఉంటుందని పోస్టర్లలో పేర్కొన్నారు. పోస్టర్లలో 1985 పేలుడుతో కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం చూడవచ్చు. యూకే, అమెరికా, కెనడాాల్లో భారతీయ రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ దాడులపై ఎన్ఐఏ విచారణ చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది.

Read Also: Enceladus: శని గ్రహ చంద్రుడిపై పాస్పరస్.. జీవానికి కీలకం అంటున్న శాస్త్రవేత్తలు..

1985 ఎయిర్ ఇండియా బాంబింగ్:

జూన్ 23, 1985న, 329 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 టొరంటో నుంచి లండన్ కు వెళ్తుండగా ఐర్లాండ్ తీరంలో విమానంలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో విమానంలో ఉన్న వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం సిక్కు తీవ్రవాదులు ఈ విమానాన్ని పేల్చేశారని ఆరోపించబడింది. గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాల ముందు, ఎటువంటి హెచ్చరికలు లేకుండా విమానం గాలిలోనే పేలిపోయింది.

రాడార్ స్క్రీన్‌ల నుండి విమానం అదృశ్యమైన తర్వాత, అత్యవసర రెస్క్యూ బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి పంపించారు. అయితే, ప్రాణాలతో బయటపడలేదు. సముద్రం నుంచి 131 మృతదేహాలను రెస్క్యూ టీమ్‌లు వెలికితీశాయి. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా తల్విందర్ సింగ్ పర్మార్ వ్యవహారించినట్లు కెనడా పోలీసులు ఆరోపించారు. మరో నిందితుడు ఇందర్ జిత్ సింగ్ రేయత్ ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరితో పాటు రిపుదమన్ సింగ్ మాలిక్ మరియు అజైబ్ సింగ్ బగ్రీలను 2000లో అరెస్టు చేశారు. వీరిపై ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు.

2006లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడిపై విచారణ జరిపేందుకు కెనడియన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2018లో, 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి జరిగిన 33 సంవత్సరాల తర్వాత, 329 మంది బాధితులకు నివాళులు అర్పించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ సంఘటనను దేశ చరిత్రలో “ఒకే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి”గా అభివర్ణించారు.