NTV Telugu Site icon

Port workers union: ఇజ్రాయిల్ వెళ్లే నౌకలను నిర్వహించం.. పోర్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు..

Ports

Ports

Port workers union: గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాలకు సైనిక సామాగ్రితో వెళ్లే ఓడల్ని నిర్వహించకూడదని పోర్ట్ వర్కర్స్ యూనియన్ తమ సభ్యులకు పిలుపునిచ్చింది. దేశంలోని 11 ప్రధాన ఓడరేవుల్లో 3500 మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్ ట్రాన్స్‌పోర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-పాలస్తీనాలకు సైనిక సామాగ్రిని తీసుకెళ్లే మరే ఇతర దేశం నుమచి ఆయుధ కార్గోలను లోడ్ చేయడం లేదా అన్ లోడ్ చేయడం లేదని తెలిపింది. సైనిక సామాగ్రిని తీసుకెళ్లే షిప్‌లను నిర్వహించవద్దని సమాఖ్య తన సభ్యులకు పిలుపునిచ్చింది.

ఫిబ్రవరి 14న విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘‘ఫెడరేషన్ వారు కార్మిక సంఘాల్లో భాగమని, గాజా యుద్ధానికి, మహిళలు, పిల్లల వంటి అమాయక ప్రజలను చంపడానికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా నిలబడతాం’’ అని పేర్కొంది. గాజాలోని ఇజ్రాయిల్ సైనిక దాడుల్ని ఖండించింది. యుద్ధంలో మహిళలు, పిల్లలు చనిపోతున్నారు, ప్రతీ చోటా పేలుతున్న బాంబుల్లో చనిపోయిన వారి పిల్లల్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు అని చెప్పింది.

Read Also: Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..

యుద్ధంలోని నష్టాన్ని పరిగణలోకి తీసుకుని యూనియన్ సభ్యులమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. అమాయక ప్రజల ప్రాణాలు తీసే సామర్థ్యాన్ని అందించేందుకు సహాయపడమని చెప్పింది. ఆస్ట్రేలియా, స్పెయిన్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర దేశాలలో వర్కర్స్ యూనియన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇజ్రాయిల్‌కి పంపే సైనిక పరికరాలను నిర్వహించొద్దని పిలుపునిచ్చాయి.

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడ్డారు. 1200 మంది ఇజ్రాయిలీలను ఊచకోత కోయడంతో పాటు 253 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 28,985 మంది పాలస్తీనియన్లు మరణించగా, 68,883 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.