NTV Telugu Site icon

Tamil Nadu: జవాన్‌ను కొట్టి చంపిన కౌన్సిలర్.. తమిళనాడులో పొలిటికల్‌ హీట్..

Soldier

Soldier

Tamil Nadu: జవాను హత్యపై తమిళనాడు రాజకీయం అట్టుడుకుతోంది. డీఎంకే సర్కారుపై బీజేపీ రగిలిపోతోంది. దేశాన్ని కాపాడే సైనికులకే తమిళనాడులో భద్రత కరువైందని విమర్శిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. అటు వీధి గొడవ కారణంగా జరిగిన హత్యను బీజేపీ రాజకీయం చేస్తోందని డీఎంకే సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారని వాదిస్తోంది డీఎంకే. అయితే, తమిళనాడు కృష్ణగిరిలో చిన్న గొడవ విషయంలో లాన్స్ నాయక్ ఎం.ప్రభును కొట్టి చంపాడు, డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి. అనుచరులతో కలిసి జవాను కుటుంబంపై దాడి చేశాడు. కత్తులు, కర్రలతో విచక్షణా రహితంగా అటాక్ చేశాడు. ఈ ఘటనలో లాన్స్ నాయక్ ప్రభు సోదరులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జవాన్ చనిపోయాడు. అతని బ్రదర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. డీఎంకే కౌన్సిలర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈనెల 8న ఈ ఘటన జరిగింది.

Read Also: Physical harassment: కోనసీమలో సామూహిక అత్యాచారం.. బాలిక శీలానికి వెలకట్టి కప్పిపుచ్చే యత్నం..!

చిన్న గొడవ.. చాలా చిన్న గొడవ కారణంగా దారుణం జరిగింది. నిత్యం వీధుల్లో జరిగే గొడవలాంటిదే. తమిళనాడు కృష్ణగిరిలో లాన్స్ నాయక్ ఎం. ప్రభు, కౌన్సిలర్ చిన్నస్వామి ఇళ్లు.. సమీపంగానే వుంటాయి. కౌన్సిలర్ ఇంటి దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ బట్టలు ఉతికే విషయంలో ఆర్మీ జవాన్ ప్రభు, కౌన్సిలర్ మధ్య మాటామాట పెరిగింది. కౌన్సిలర్, సోల్జర్ మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ సాగింది. అయితే, కార్పొరేటర్ చిన్నస్వామి, రాత్రి జవాను ఇంటిపై తన అనుచరులతో కలిసి అటాక్ చేశాడు. కత్తులతో దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జవాను చనిపోయాడు. కానీ, జవాన్ హత్య జాతీయస్థాయిలోనూ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అధికార డీఎంకే నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అవుతోంది. అటు డీఎంకే కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లో జవాను చనిపోలేదని, వీధి గొడవలో చనిపోయాడని అంటోంది డీఎంకే. అయినా దేశానికి సేవలందించిన సైనికుడి మరణం, తమనూ ఎంతగానో బాధించిందని, నిందితులు ఇప్పటికే అరెస్టు అయ్యారని చెబుతోంది. ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించింది డీఎంకే. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Show comments