Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అరెస్ట్ ‘రాజకీయ కుట్ర’ అని గురువారం ఆరోపించారు. ఈడీ కస్టడీ ఈరోజు ముగియడంతో మరో 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ.. దర్యాప్తు సంస్థ రౌస్ ఎమెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు గదిలోకి తీసుకువచ్చే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టుకి హాజరయ్యారు.
Read Also: Lemons: దేవుడా.. 9 నిమ్మకాయలు కేవలం రెండున్నర లక్షలే.. అసలు అంతలా ఏముంది వాటిలో..?!
కోర్టులో కేజ్రీవాల్ సొంత వాదనలు వినిపించారు. ఈ కేసులో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని అన్నారు. సీబీఐ 31 వేల పేజీల, ఈడీ 25 వేల పేజీల ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. మాగుంట రాఘవ రెడ్డి ఇచ్చిన 7 స్టేట్‌మెంట్లలో ఆరింటిలో తన పేరు లేదని చెప్పారు. లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగితే, ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత రూ. 55 కోట్లని బీజేపీకి డొనేషన్ ఇచ్చారని అన్నారు. ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయని, తనను ఈ కేసులో ఇరికించడం, రెండోది ఆప్ పార్టీ లేకుండా చేయడమని ఆరోపించారు. నాపై ఎలాంటి కేసు లేదని, ఈడీకి నచ్చినన్ని రోజులు కస్టడీలో ఉంచుకోండి అని అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా.. ఢిల్లీ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరో 7 రోజులు ఈడీ కస్టడీ కోరుతోంది. కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్‌ని ప్రశ్నించాలని చెప్పింది. ఈ కేసులో పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పింది.