NTV Telugu Site icon

High Court: రేప్ బాధితులకు గర్భం తొలగించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలియజేయాలి..

High Court

High Court

Karnataka High Court: అత్యాచార బాధితురాలు గర్భంతో ఉంటే, 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బాధితులకు ఆయా పరిధిలోని పోలీసులు చెప్పాలని కర్ణాటక హైకోర్టు దిశానిర్దేశం చేసింది. దీని వల్ల బాధితులు సమయం దాటాక కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, నేర ఫలితంగా గర్భం దాల్చింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోక్సో, అత్యాచార సెక్షన్లు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

నేర ఫలితంగా తన కూతురు గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమె 24 వారాల గర్భవతి అని.. బాధితురాలికి ప్రెగ్నెన్సీని కొనసాగించడం ఇష్టం లేదని వైద్యపరంగా రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ సూరజ్ గోవింద్ రాజ్.. ‘‘ఇలాంటి నిర్ణయం ఇంతకుముందే తీసుకుంటే పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు’’ అంటూ డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Ponnam Prabhakar: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే..

అత్యాచార బాధితురాలు/ ఆమె సంరక్షకుడు కోరుకుంటే, గర్భ విచ్ఛత్తికి సంబంధించి వైద్యపరంగా అనుసరించాల్సిన విధానం, ప్రక్రియను తెలియజేసేలా దర్యాప్తు అధికారులు, పోలీసులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు ఆదేశించింది. విచారణ అధికారి తన పరిధిలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యుడిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.

ప్రస్తుత కేసులో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చేయించుకోవడానికి ముందుగా వైద్య నిపుణులు, శిశు వైద్యుడు, సైకాలజిస్టులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి బాధితురాలి ఫిట్‌నెస్ పరీక్షించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 12న నివేదిక సమర్పించగా.. ఎంటీపీ చేపట్టేందుకు హైకోర్టు అనుమతించింది. ఎంటీపీ తర్వాత పిండానికి సంబంధించిన కణజాల నమూనాలను డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్రపరచాలని పోక్సో ట్రయల్ కోర్టు ఆదేశిస్తే అలాగే చేయాలని హైకోర్టు ఆదేశించింది.