NTV Telugu Site icon

PM Modi: బతికి ఉన్నవారిని, చనిపోయినవారిని దోచుకోండి.. శామ్ పిట్రోడాపై పీఎం ఆగ్రహం..

Pm Modi

Pm Modi

PM Modi: వరస వివాదాల్లో కాంగ్రెస్ ఇరుక్కుంటోంది. ఇప్పటికే ‘సంపద పునర్విభజన’ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీతో పాటు బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన శామ్ పిట్రోడా వారసత్వ పన్ను విధించాలని కోరిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సంపద సర్వే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై ఇప్పటికే రగులుతున్న వివాదానికి ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. తాజాగా బుధవారం రోజు పీఎం మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సర్‌గుజాలో మాట్లాడిన మోడీ.. ప్రజలు కష్టపడి సంపాదించిన సంపదను తమ పిల్లలకు అందించకుండా అధిక పన్నులు విధించడం ద్వారా కాంగ్రెస్ తన ఖజానాను నింపుకోవాలని అనుకుంటోంది. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని ‘యువరాజు’(రాహుల్ గాంధీ) మరియు రాజకుటుంబ సలహాదారు(శామ్ పిట్రోడా) చెబుతున్నారని ప్రధాని దుయ్యబట్టారు. ‘‘వారసత్వవపు పన్ను విధిస్తామని, తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వంపై కూడా పన్ను విధిస్తామని కాంగ్రెస్ అంటోంది. మీరు కష్టపడి కూడబెట్టిన సంపద మీ పిల్లలకు దక్కదు. కాంగ్రెస్ లాగేసుకుంటుంది’’ అని ఆరోపించారు.

పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రమాదకర ఉద్దేశాలను బయటపెట్టాయని ప్రధాని అన్నారు. బతికి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా దోచుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని తన సొంత ఆస్తిగా( గాంధీ కుటుంబం గురించి) తమ పిల్లలకు అప్పగించిన వారు, ఇప్పుడు భారతీయులు తమ ఆస్తుల్ని తమ పిల్లలకు పంచడం ఇష్టం లేదని అన్నారు.

Read Also: Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” రిలీజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..

శామ్ పిట్రోడా ఏమన్నాడు..?

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సందప పునర్విభజనపై తన పార్టీకి మద్దతు తెలిపారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో్ వారసత్వ పన్ను భావన ఉందని దానిని ఇండియాలో కూడా అమలు చేయాలని అన్నారు. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. ఒక వ్యక్తి 100 మిలియన్ డాలర్లు సంపాదిస్తే, దాంట్లో 45 శాతం అతడి పిల్లలకు బదిలీ చేస్తే, 55 శాతం ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఇది ఆసక్తికరమైన చట్టం. భారతదేశంలో ఎవరైనా 10 బిలియన్ డాలర్ల ఆస్తిని సంపాదిస్తే, వారి పిల్లలకు 10 బిలియన్ డాలర్లు వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు’’ అని అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ ప్రజల ఆస్తిని లాక్కోవాలని అనుకుంటోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శామ్ పిట్రోడా తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో్ బుజ్జగించేలా ఉందని ప్రధాని, బీజేపీ విమర్శించాయి.