PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి దగ్గరుండి వివరించనున్నారు. దీపోత్సవ వేడుకల్లో ప్రధానితో కలిసి సీఎం యోగి పాల్గొననున్నారు.
Read Also: Arif Mohammed Khan: కేరళ డ్రగ్స్ రాజధానిగా మారుతోంది.. రాష్ట్ర పరిస్థితిని చూసి సిగ్గుపడుతున్నా..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రామజన్మభూమిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామ్ కథా పార్కర్ లో రాముడు, సీతాదేవీకి పట్టాభిషేకం జరిగే కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం అనంతరం రామ్ కీ పైడి ఘాట్ వద్ద ప్రధాని మోదీ తొలి దీపాన్ని వెలిగించనున్నారు. రామ్ కి పైడితో పాటు 37 ఘాట్లలో 1.8 మిలియన్ల దీపాలను వెలిగించాలని ప్లాన్ చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయాలని అయోధ్య పాలక వర్గం భావిస్తోంది. సరయూ నది ఒడ్డున జరిగే ఆరతి కార్యక్రమానికి కూడా ప్రధాని మోదీ హాజరు అవుతారు. ప్రధాని హోదాలో రెండోసారి అయోధ్యకు వెళ్తున్నారు. ఆగస్టు 5,2020న రామమందిర భూమి పూజకు వెళ్లిన ఆయన దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అయోధ్యకు వెళ్తున్నారు.