NTV Telugu Site icon

PM Modi: మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే.. భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు

Modi

Modi

ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్‌లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.

మోడీ ప్రస్థానమిదే..!

ప్రధాని మోడీ… గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేశారు. అటు తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా ప్రయాణం మొదలై.. గుజరాత్ ముఖ్యమంత్రి.. దేశ ప్రధానిగా సేవలందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీలో పలు పదవులు అనుభవించారు. 2014లో ప్రధాని పదవికి మోడీ ప్రమాణస్వీకారం చేశారు.

మోడీ.. 17 ఏళ్ల వయసులో తన ఇంటిని వదిలి దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. భారతదేశ పర్యటనలో హిమాలయాలలోని గరుడచట్టిలో బస చేసి, పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈశాన్య ప్రాంతాలకు కూడా వెళ్లారు. ఈ యాత్రలు నరేంద్ర మోడీ జీవితంపై పెను ప్రభావం చూపాయి. మోడీ 2 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. రెండు వారాలు మాత్రమే ఉన్నారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరారు. సంఘ్‌లో చేరేందుకు అహ్మదాబాద్‌ చేరుకున్నప్పుడు నరేంద్ర మోడీ వయసు కేవలం 20 ఏళ్లు.

1973 డిసెంబర్‌లో గుజరాత్‌లోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు… పెరిగిన మెస్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడంతో అది ఉద్యమంగా మారి నవనిర్మాణ ఆందోళనగా మారింది. తర్వాత జేపీ కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమం ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇందిరా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు నరేంద్ర మోడీ దీనిని వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ సమయంలో మోడీకి పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది.

మోడీ 1988లో బీజేపీ గుజరాత్ యూనిట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అయోధ్య రథయాత్ర, 1991–92లో మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. మోడీ బీజేపీ సంస్థలో క్రమంగా ఎదిగి గుర్తింపు పొందారు. దీని తర్వాత రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు.

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నరేంద్ర మోడీని బీజేపీ కోరింది. మోడీ 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగానే బీజేపీని గెలిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నిలబెట్టినప్పుడు.. మోడీ దేశవ్యాప్తంగా పార్టీ మరియు ఎన్డీయే కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 116 సీట్లు గెలుచుకున్న బీజేపీ… 2014 లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014 నుంచి 2024 వరకు ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. అంటే మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా… మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ రికార్డు మోడీకి మాత్రమే సొంతం.