PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఆయన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ వోహ్రా ఇటీవల కలిశారు. తనకు సంబంధించిన పాత భూ వివాదంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధానిని కోరినట్లు సమాచారం. ఈమేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ కూడా అందించారు. 81 ఏళ్ల అస్గల్ అలీ గుజరాత్ వడ్నగర్‌లో బీఎన్ స్కూల్‌లో మోడీతో కలిసి చదువుకున్నారు. సెప్టెంబర్ 8, 2026న ఆయన ప్రధానిని కలిశారు.
మహారాష్ట్రంలోని భయందర్, నవ్‌ఘర్ రోడ్ ప్రాంతంలో ఉన్న 2810 చదరపు మీటర్ల భూమికి సంబంధించిన వివాదంపై అస్గర్ అలీ ప్రధానిని కలిశారు. 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా తాను ఈ భూమిని కొనుగోలు చేసినట్లు వోహ్రా తన లేఖలో పేర్కొన్నారు. తాను ఆ భూమిని ఎవరికీ విక్రయించలేదని, మరెవరికి బదిలీ చేయలేదని ఆయన చెప్పారు. 2011లో తన భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారని, ఇందులో ‘‘స్వయం బిల్డర్స్’’ కుమ్మకయ్యారని ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందినవిగా పేర్కొన్న ‘సెవెన్ ఎలెవెన్ కన్స్ట్రక్షన్స్’, ‘స్వయం బిల్డర్స్’ సంస్థలపై వోహ్రా ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా భూమిని రెండు భాగాలుగా విభజించినట్లు ఆయన పేర్కొన్నారు. భూమిని రెండు బిల్డర్స్ సంస్థలు ఆక్రమించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో 2015లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తు సుమారు 11 ఏళ్ల తర్వాత 2026లో సీఐడీ నివేదిక ఇచ్చిందని అస్గర్ లేఖలో ఆరోపించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
అస్గర్ ప్రధానిని కలిసిన తర్వాత, స్థానిక మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. ఈ కేసు ఇప్పుడు 2026 సెప్టెంబర్ 16న విచారణకు రానుంది. ఈ విచారణఖు హాజరు కావాలని రెండు కంపెనీలను అధికారులు ఆదేశించారు.

