NTV Telugu Site icon

Devendra Fadnavis: 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటర్..

New Project

New Project

Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ నెలలో నరేంద్రమోడీ రిటైర్ అవబోతున్నారని ఆయన కామెంట్స్ చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రౌత్ వాదనల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2029 ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రధాని పదవిలో కొనసాగుతారని చెప్పారు.

సంజయ్ రౌత్ మొఘల్ మనస్తత్వం కలిగి ఉన్నాడని ఫడ్నవీస్ విమర్శించాడు. భారతీయ సంస్కృతిలో పెద్దలు ఉన్నప్పుడు చిన్నవారు పదవుల గురించి ఆలోచించారని, ఆయనది మొఘల్ సంస్కృతి అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించడం వెనక కారణం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి తన పదవీ విరమణ గురించి తెలియజేయడమే అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Meerut murder case: జైల్లో నిందితులకు రామాయణం అందజేసిన నటుడు

‘‘ మోడీ జీ మా నాయకుడు, ఆయన భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. 2029లో కూడా మోడీని ప్రధాని మంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. పదవీవిరమణ, అత్యున్నత పదవి గురించి చర్చించడానికి మేము అర్హులం కాదు’’ అని ఫడ్నవీస్ అన్నారు. సెప్టెంబర్ నెలలో బహుశా ప్రధాని మోడీ పదవీ విరమణ చేయబోతున్నారు, అందుకే దరఖాస్తు చేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండొచ్చు అని రౌత్ అన్నారు. సంఘ్ పరివార్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటోందని, ప్రధాని మోడీ కాలం ముగిసిందని అన్నారు.

సెప్టెంబర్ 17న 75 ఏళ్లు నిండనున్న ప్రధానమంత్రి ఈ ఏడాది రాజీనామా చేస్తారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ గతంలో ఈ నిబంధన పెట్టిందని, అంతకన్నా పెద్ద వయసున్న పార్టీ నాయకులు మంత్రి పదవులు పొందలేరని ఆయన అన్నారు. అలాంటి నియమం ఏమి లేదని బీజేపీ చెబుతోంది.