PM Modi: 2023లో మణిపూర్‌లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ సెప్టెంబర్ 13న ఇంఫాల్‌కు చేరుకుని, చారిత్రాత్మక కాంగ్లా కోట లోపల జరిగే సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత చురచంద్‌పూర్‌కు వెళ్లనున్నారు.
Read Also: BCCI: ఒడియమ్మా! రూ.20 వేల కోట్లతో ప్రపంచంలోనే అగ్రగామి బోర్డుగా బీసీసీఐ
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో, ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల సుందరీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. డివైడర్లకు పెయింట్ వేస్తున్నారు. రోడ్డు పక్కల ఉన్న పొదల్ని కత్తిరిస్తున్నారు. భద్రత పెంచడం వల్ల ప్రయాణికులు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు ప్రయాణ సలహా కూడా జారీ చేశారు. ఇంఫాల్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాంగ్లా కోటకు చేరుకుని, 15000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనునన్నారు.
ఇప్పటికే వేదిక వద్ద ఉన్న హెలిప్యాడ్‌ను పునరుద్ధరించే పనిలో అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. 24 గంటలు నిఘా పెడుతున్నారు. అనధికారికంగా ఫోటోలు తీయడం నిషేధించబడింది. ఈ కార్యక్రమం తర్వాత, చూరచంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్‌లో జరిగే సమావేశంలో ప్రధాని ప్రసంగించనున్నారు. మైదానంలో 9000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని మణిపూర్ పర్యటన నుంచి అక్కడి ప్రజలు చాలా ప్రకటనలు ఆశిస్తున్నారు. చురాచంద్‌పూర్‌లోని ప్రజలు ప్రధానికి వ్యక్తిగతంలో మెమోరాండం ఇవ్వాలని యోచిస్తున్నారు.
