PM Modi to launch 75 digital banking units across 75 districts: దేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రజలకు మరింతగా చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రోజున 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను(డీబీయూ) ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న డీబీయూలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
2022-23 కేంద్రబడ్జెట్ లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతస్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డీబీయూలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా 75 డీబీయూలను ప్రారంభించనున్నారు ప్రధాని.
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో వీటిని ప్రారంభించనున్నారు. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఫైనాన్సింగ్ బ్యాంకులు ఈ ప్రయత్నంలో భాగం కానున్నాయి. ఈ డీబీయూలు ప్రజలకు సేవింగ్స్ ఖాతా తెరవడంతో పాటు బ్యాలెన్స్ చెక్, పాస్ బుక్ ఫ్రింగింగ్, క్రెడిట్-డెబిట్ కార్డుల కోసం దరఖాస్తులు, అకౌంట్ స్టేట్మెంట్, పన్నులు చెల్లించడం, బిల్లులు చెల్లించడం వంటి సేవలను అందించనున్నాయి. దీంతోపాటు డీబీయూలు ఏడాది పొడవున బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. తక్కువ ఖర్చుతో సేవలు పొందే సౌకర్యాన్ని ఈ డీబీయూలు కల్పించనున్నాయి. ఈ డీబీయూలు డిజిటల్ ఫైనాన్షియల్ లిటరీసీని కూడా వ్యాప్తి చేయడంతో పాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించనున్నాయి.