Z-Morh Tunnel: జమ్మూ-కశ్మీర్ లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. అయితే, ఈ టన్నెల్ ఓపెనింగ్ కు ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఆదివారం అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: Bhogi Festival: భోగభాగ్యల భోగి అనగా అర్ధం ఏమిటి..?
ఇక, కొన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని సైతం భారీగా మోహరించారు. పలు జిల్లాల్లోని ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ జరుగుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్‌లతో సహా వైమానిక, సాంకేతిక నిఘా పెట్టినట్లు చెప్పారు. అలాగే, శనివారం నుంచి ఈరోజు (సోమవారం) వరకు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని అధికారులు బంద్ చేశారు. జెడ్-మోర్ సొరంగం సమీపంలో ఎస్పీజీ సిబ్బంది కార్యక్రమ వేదికను పూర్తిస్థాయిలో తమ అధీనంలోకి తీసేసుకుంది. గగాందీర్ దగ్గర ప్రధాని మోడీ బహిరంగ ర్యాలీలో ప్రసంగించే ఛాన్స్ ఉందని జమ్ము కాశ్మీర్ అధికారులు పేర్కొన్నారు.