Site icon NTV Telugu

Niti Aayog: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

Pm Modi

Pm Modi

Niti Aayog: నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్‌, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.

స్థిరమైన, సమ్మిళిత భారతాన్ని నిర్మించే దిశలో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం కొనసాగుతుందని.. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం వైపు సమన్వయాలకు ఈ భేటీ మార్గం సుగమం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్నందున, రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు పయనించడం ఆవశ్యకమని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ సమావేశానికి సన్నాహాల్లో భాగంగా జూన్ 2022లో ధర్మశాలలో జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు ప్రధాని అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

Piyush Goyal: కేసీఆర్ తెలంగాణకు “నిజాం”గా మారాడు.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదు

నీతిఆయోగ్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొననున్నారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశాన్ని బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక మండలికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, అది నేతిబీర చందంగా మారిందని, దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version