కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని పలు రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల బలోపేతం కోసం జూన్ 16,17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పీఎం నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలు, అభివృద్ధి విధానాలపై చర్చించనున్నారు.
అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించనున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే తర్వాత దేశం అభివృద్ధి చెందుతుందని పలు సందర్బాల్లో మోదీ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం, దానిని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించనున్నారు. సమావేశంలో ప్రధానితో అధికారులంతా చర్చించి దేశ వ్యాప్తంగా అభివృద్ధికి రోడ్‌మ్యాప్, బ్లూప్రింట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండా పాయింట్లను జూన్ 5లోగా పంపించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. ఒక్కో రాష్ట్రం నుంచి సీఎస్ తో పాటు గరిష్టంగా ముగ్గురు అధికారులు పాల్గొననున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మంది అధికారులు హాజరుకానున్నారు.
టీం ఇండియాగా పనిచేయడంతో పాటు సుస్థిరత, ఉద్యోగాల కల్పన, విద్యా, జీవన సౌలభ్యం, వ్యవసాయం, ఆత్మ నిర్భర్ పై ప్రధాని మోదీ, అధికారులు చర్చించనున్నారు. జాతీయ విద్యావిధానం అమలు, పట్టణ పాలన, పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పు ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిని సాధించడం వంటి అంశాలను నేషనల్ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు.