Site icon NTV Telugu

PM Modi: విపక్షం తప్పు చేసింది.. పర్యవసానాలు చూస్తారు.. కేబినెట్‌లో మోడీ కీలక వ్యాఖ్యలు

Modi2

Modi2

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లు వీగిపోయింది.

ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం తప్పు చేసిందని.. పర్యవసానాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు మహిళలకు ప్రతిపక్ష సభ్యులే సమాధానం చెప్పుకోవాలన్నారు.

పార్లమెంటులో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఓట్లు రాలేదు. ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు కేవలం 298 మంది మాత్రమే ఆమోదం తెల్పగా.. 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఇదే అంశంపై ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడుతూ.. శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. దాన్ని విపక్షం తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు.

తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.

Exit mobile version